శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ అంతంత మాత్రమే ఉండటంతో పాటు, పలువురు శాసనసభ్యులు ఇప్పటికే జగన్‌కు జై కొట్టడంతో, ప్రభుత్వ మనుగడపై సందేహాలు ముప్పిరిగొంటున్నాయి. వరుసగా రెండో దఫా అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకే ఇంతటి దుస్థితిని ఎదుర్కోవడానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానమే కారణమని చెప్పవలసి ఉంటుంది. 2014 నాటికి రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని కలలు గంటున్న కాంగ్రెస్ వ్యూహకర్తలకు, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మింగుడు పడటం లేదు. కేంద్రంలో అధికారం చలాయించడానికి అవసరమైన బలం (ఎం.పి.లు) సమకూర్చిన రాష్ట్రం, క్రమంగా తమ చేజారి పోతున్నదన్న ఆవేదన కాంగ్రెస్ పెద్దలలో కనిపిస్తున్నది.
అయితే ఈ పరిస్థితి ఏర్పడటానికి వ్యూహ రచనా లోపమే కారణమన్న వాస్తవాన్ని అధిష్ఠానం ఇంతవరకూ గుర్తించలేదు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం చేసిన ప్రకటనతో ఇటు తెలంగాణలో, వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ విషయంలో వ్యవహరించిన తీరుతో అటు సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లే పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాన పోటీ జగన్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే ఉండే అవకాశం ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర సమితి ముందు, జగన్ పార్టీతో సహా అన్ని పార్టీలూ తలవాల్చాల్సిన పరిస్థితి. రాజకీయం ఇలాగే కొనసాగితే తమిళనాడు తరహాలో ఇక్కడ కూడా కాంగ్రెస్ తోక పార్టీగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
ముప్పు ముంచుకొస్తున్నా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గానీ, ఢిల్లీ పెద్దలు గానీ, 'జరిగింది ఏమిటి? జరగవలసింది ఏమిటి?' అనే అంశాలపై దృష్టి పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. రాజకీయ అనుభవం లేకపోయినా, ఒక దివంగత ముఖ్యమంత్రి కుమారుడు తమ అస్తిత్వానికే ప్రమాదకరంగా ఎలా పరిణమించారన్న విషయాన్ని విశ్లేషించి, తదుపరి వ్యూహాన్ని రచించుకోవలసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. 'జగన్‌కు ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది. దాన్ని ఓటు బ్యాంకుగా మలచుకోవలసి ఉంది' అని జగన్ వర్గీయుడైన కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ. మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఇదివరకే ప్రకటించారు.
జగన్ పట్ల ప్రజలు ఎందుకు ఆకర్షితులవుతున్నారో కాంగ్రెస్ నేతలు ముందుగా విశ్లేషించుకోవలసి ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన స్వేచ్ఛతో ప్రవేశపెట్టిన పథకాల ప్రభావం ప్రజలపై విపరీతంగా ఉంది. అందువల్లే అప్పట్లో భారీ స్థాయిలో అవినీతి కుంభకోణాలు చోటు చేసుకున్నా ప్రజలకు పట్టలేదు. అయితే ఈ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదన్న అభిప్రాయం ఏర్పడే బదులు, రాజశేఖరరెడ్డి కారణంగానే తమకు లబ్ధి చేకూరిందన్న భావన ప్రజల్లో వ్యాపించింది. అలా జరగడానికి రాజశేఖరరెడ్డి రచించిన వ్యూహాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం అర్థం చేసుకోలేకపోయింది.
"రాజశేఖరరెడ్డి మరణిస్తారని గానీ, జగన్ ఇలా తిరుగుబాటు చేస్తారని గానీ మేం కలలో కూడా ఊహించలేదు. అందుకే పార్టీ బదులు రాజశేఖరరెడ్డి జపం చేశాం. ఆయన మరణానంతరం కూడా అదే కొనసాగించాం. ఇప్పుడు అదే మా పాలిట శాపంగా మారుతున్నది'' అని ఒక మంత్రి ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలును సమీక్షించాలని రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడే నిర్ణయించారు. కానీ ఆ విషయం ప్రజల్లోకి వెళ్లేలా చేయడంలో ప్రస్తుత మంత్రులు విఫలమవుతున్నారు.
దీంతో రాజశేఖరరెడ్డి బతికి ఉంటే తమకు మరింత మేలు జరిగి ఉండేదని అమాయక ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిస్థితినే జగన్ క్యాష్ చేసుకుంటున్నారు. రాజశేఖరరెడ్డికి ప్రజల్లో ఉన్న సానుభూతిని తనవైపు మళ్లించుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో ఎవరైనా ఇలాగే చేస్తారు! రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే మీకు ఈ గతి (ఏ గతి?) పట్టి ఉండేదా? అని ప్రజలను ప్రశ్నించడం ద్వారా జగన్, కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడటానికి బీజం వేయడంతో పాటు, తన తండ్రి స్మృతులు జనంలో సజీవంగా ఉండేలా చూసుకుంటున్నారు.
జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి గానీ, ప్రతి వ్యాఖ్యలు చేయడానికి గానీ మంత్రుల నుంచి శాసన సభ్యుల వరకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. దీనికి కారణం ఎవరికి వారికి భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడమే! ఇప్పుడు జగన్‌ను వ్యతిరేకిస్తే, భవిష్యత్తులో ఆయనే నిలదొక్కుకుని కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటే, తమ పరిస్థితి ఏమిటన్న సందేహం వారిని పట్టి పీడిస్తున్నది. అలా అని జగన్‌తో చేతులు కలపడానికీ సిద్ధపడలేకపోతున్నారు. ఈ డోలాయమాన స్థితినే జగన్ సద్వినియోగం చేసుకుంటున్నారు. జగన్‌పై విమర్శలు చేస్తున్న తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుల వల్ల, జగన్‌కు సీమాంధ్రలో మేలు జరుగుతూ ఉండగా, కాంగ్రెస్‌కు నష్టం కలుగుతోంది.
దీన్ని గుర్తించడంలో కాంగ్రెస్ అధిష్ఠానం విఫలమైంది. జగన్‌ను ఢీకొనే బాధ్యతను సమర్థులైన నాయకులకు అప్పగించవలసిందిపోయి, ప్రజలతో సంబంధాలు లేని నాయకులకు వదలివేయడం కూడా ఆ పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నది. 'రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే మీకు ఈ కష్టం వచ్చి ఉండేదా? మిమ్మల్ని ఆదుకునేవారు కారా?' అని గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల పర్యటనలో రైతులను ఉద్దేశించి జగన్ ప్రశ్నించారు. వాస్తవానికి వర్షాలకు పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రకటించిన సహాయం రాజశేఖరరెడ్డి హయాంలో కంటే ఎక్కువే.
అయినా ఆ విషయాన్ని గట్టిగా చెప్పలేని స్థితిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. వై.ఎస్. హయాంకంటే ఎక్కువ సాయం ఇప్పుడే జరిగిందని ప్రజలు అర్థం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయడానికి మంత్రులు గానీ, శాసన సభ్యులు గానీ ముందుకు రాకపోవడం ఆ పార్టీ నేతల మానసిక స్థితిని తెలియజేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రజల్లో రాజశేఖరరెడ్డి ముద్రను క్రమంగా తొలగించడంతో పాటు, జగన్ ప్రభావాన్ని తగ్గించడానికి రెండంచెల వ్యూహాన్ని రచించుకోని పక్షంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతానికి మూసుకోక తప్పదు. సంక్షేమ పథకాలను, కష్టమైనా, నష్టమైనా మరింత సమర్థంగా అమలు చేయడం ద్వారా రాజశేఖరరెడ్డిని మరిపింప జేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఉంది.
కేంద్రంలో తమ పార్టీయే అధికారంలో ఉన్నందున, ఆ ప్రభుత్వ సహాయం తీసుకోవడం ద్వారా, పేద ప్రజలకు మరింత మేలు చేకూర్చే విధంగా కొత్త పథకాలను రూపొందించడం లేదా ఉన్న పథకాలకు మార్పులు, చేర్పులు చేయవలసి ఉంటుంది. తాను ప్రవేశపెట్టి అమలు చేసిన ప్రతి పథకానికీ రాజీవ్‌గాంధీ లేదా ఇందిరాగాంధీ పేరు పెట్టడం ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని రాజశేఖరరెడ్డి మభ్యపెట్టారు. అదే సమయంలో తన వల్లే ఆ పథకాలు అమలవుతున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వ్యాపించేలా మొత్తం పార్టీ యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారు. ఈ కారణంగా రాజశేఖరరెడ్డి ప్రభావం నుంచి ప్రజలను తప్పించనంత వరకు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం లో మనుగడ కష్టమే.
అదే సమయంలో జగన్మోహనరెడ్డి నైజాన్ని వివరించడం ద్వారా ప్రజల్లో ఆయన పట్ల ఉన్న సానుభూతిని తగ్గించడానికి తగిన వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ రూపొందించుకోవలసి ఉంది. జగన్మోహనరెడ్డి గురించి వ్యక్తిగతంగా తెలిసినవారికి ఆయన నైజం ఏమిటో తెలుసు. ప్రస్తుతం ఆయన వర్గంలో ఉన్న వారు కూడా ఈ వాస్తవాన్ని ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తారు. జగన్ మొండివాడు అనీ, సోనియాగాంధీనే ఎదిరించిన ధైర్యవంతుడు అనీ, రాజశేఖరరెడ్డి కుమారుడిగా ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏం నష్టం జరిగేదనీ ఒక వర్గం ప్రజల్లో అభిప్రాయం ఉంది.
నాణానికి మరోవైపు ఎలా ఉంటుందో వారికి తెలియదు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించవలసిన అవసరం ఉంది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు పారిశ్రామిక వేత్తలు ఇటీవల నన్ను కలిశారు. "జగన్‌కు ప్రజల్లో బాగానే ఆదరణ ఉందని వార్తలు వస్తున్నాయి. కొంపదీసి ఆయన అధికారంలోకి రారు కదా?'' అని ఆందోళనతో ప్రశ్నించారు. "జగన్ అధికారంలోకి వస్తే ఏమవుతుంది? ఎందుకు భయపడుతున్నారు?'' అని ప్రశ్నించగా, "2009 ఎన్నికలకు ముందు ఏదో పని కావాలని జగన్‌ను కలిశాం. మామూలుగా పనులు చేసి పెడితే ఎంతో కొంత ఇచ్చుకోవడం ఆనవాయితీ. అయితే ఆయన మాత్రం తనకు డబ్బు వద్దని, తమ కంపెనీల్లో వాటా కావాలని కోరారు. దీనితో మాకు మతి పోయినంత పని అయింది.
తండ్రి చాటు బిడ్డగానే ఆయన ఇతరుల కంపెనీల్లో వాటాలు ఆశిస్తే, పొరపాటునో- గ్రహపాటునో ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో కంపెనీల పరిస్థితి ఏమిటి?'' అని వారు ప్రశ్నించారు. కేవలం అయిదేళ్ల వ్యవధిలో వేల కోట్ల రూపాయలను జగన్ ఎలా సమకూర్చుకోగలిగారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తికి అధికారం అప్పగిస్తే ఏమి జరుగుతుందో ప్రజలకు అర్థమయ్యేలా వివరించి, ఆయన ప్రభావం నుంచి పార్టీని రక్షించుకోవలసిన బాధ్యత కాంగ్రెస్ నేతలపై ఉంది. ఇందుకు అవసరమైన వ్యూహ రచన చేసుకోకుండా, ఆయన కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులతో దాడులు చేయించడం వల్ల ఫలితం ఏమి ఉంటుంది? అదనపు పన్ను కట్టమంటే కట్టడానికి జగన్ సిద్ధంగానే ఉన్నారు.
ఎందుకంటే ఆయన వద్ద డబ్బుకు కొదవలేదు కదా! ఈ కారణంగానే, జగన్‌తో చేరితే ఆర్థికంగా లబ్ధి పొందవచ్చునని పలువురు ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు ఉత్సాహం చూపుతున్నారు. "నేను మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ జగన్‌తో కలవను. ఆయన గురించి నాకు బాగా తెలుసు. జనం అంతా ఆయన వైపు ఉన్నా, నేను ఇంట్లో అయినా కూర్చుంటాను గానీ ఆయనతో కలవను.
ఒకసారి జగన్ అధికారంలోకి వస్తే ఏమి జరుగుతుందో రెండేళ్లకే ప్రజలకు తెలిసి వస్తుంది. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌నే ప్రజలు ఆశ్రయిస్తారు'' అని ఒక ఎం.పి. చేసిన వ్యాఖ్యలు గమనార్హం. కాంగ్రెస్ బలహీనపడి, జగన్ ఎంతో కొంత బలంగా ఉండటానికి మరో కారణం కూడా ఉంది. అది ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పుంజుకోకపోగా, మరో ప్రతిపక్షమైన ప్రజారాజ్యం పార్టీ మరింత బలహీనపడటం.
అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని బలపడవలసిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇందుకు కారణాలు ఏమిటో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్వేషించుకోవలసి ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ స్నేహ హస్తాన్ని అందుకోవడం ద్వారా తమ భవిష్యత్తు పదిలం అని భావిస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, కిందిస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. గత ఎన్నికలలో ఆయనకు అండగా నిలిచిన ఆయన సామాజిక (కాపు) వర్గం, ఇప్పుడు ఆయన పట్ల విశ్వాసాన్ని కోల్పోవడమే కాకుండా జగన్ వైపు ఆకర్షితమవుతున్నది.
నిజానికి కాపులను కూడగట్టడం ద్వారా, జగన్ వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయగలడన్న విశ్వాసంతోనే, కాంగ్రెస్ అధిష్ఠానం చిరంజీవికి స్నేహ హస్తాన్ని చాచింది. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కోస్తా జిల్లాలలో ప్రస్తుతం జగన్‌తో చేతులు కలుపుతున్నట్లు ప్రకటించిన నాయకులలో, అత్యధికులు కాపు వర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఈ వాస్తవాన్ని గుర్తించి తగు విరుగుడు చర్యలు తీసుకోని పక్షంలో ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతుంది. తాము బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ కూడా వదిలించుకుంటుందన్న వాస్తవాన్ని గుర్తించి, కనీసం తన సామాజిక వర్గం మద్దతు పొందడానికైనా చిరంజీవి కృషి చేయవలసి ఉంది.
మొత్తం మీద రాష్ట్ర పరిస్థితులను సమీక్షించి, తక్షణం విరుగుడు చర్యలు చేపట్టని పక్షంలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తనకు తానే మరణ శాసనం రాసుకున్నట్లు అవుతుంది. దివంగత రాజశేఖరరెడ్డి కారణంగా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రజలు పెద్ద పీట వేస్తున్నారు. భావితరాల గురించి ఆలోచించేవారు కనిపించడం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు గడ్డు రోజులే ఎదురవుతాయి.

No comments:
Post a Comment