Sunday, October 3, 2010

అలహాబాద్ పంచాయతీ ... అందరికీ న్యాయం

‘ఆలస్యం అమృతం విషం’ అన్న వాడెవడోగాని తన అభిప్రాయాన్ని అర్జంటుగా మార్చుకోవాలి. కనీసం కొన్ని వ్యవహారాల్లో ఎంత ఆలస్యం అయితే అంత మంచిదని అలహాబాదు హైకోర్టు వారి అయోధ్య తీర్పు చూశాక చచ్చినట్టు ఒప్పుకోవాలి. ఈ తీర్పే కనుక పదేళ్ల కిందట వచ్చి ఉంటే దేశమంతా అల్లకల్లోలమయ్యేది. అది రామజన్మ భూమేనని తేల్చాక ఆ భూమిలో ముస్లింలకు ఎందుకు వాటా ఇవ్వాలని సాధుసంతులూ, సింగాల్లూ... మా మసీదును కుప్పకూల్చిన వాళ్లకు అదే స్థలం మీద హక్కునివ్వటమేమిటని ఇమాంలూ, షాబుద్దీన్లూ గావుకేకలు పెడుతూ మిన్నూమన్నూ ఏకంచేస్తూండేవాళ్లు. ‘బందు’లూ, డైరక్టు యాక్షన్లూ, పనిలో పనిగా మతకలహాలూ, వాటిని అణచేందుకు కర్ఫ్యూలూ, కాల్పులతో యావద్భారతం అట్టుడికిపోయేది.
ఇప్పుడూ అలా అవుతుందని పాపం మన పోలీసులు ఎంత హడలిపోయారు! లక్నో బెంచి నుంచి ఇలా తీర్పు రాగానే అలా దేశమంతటా మంటలంటుకుంటాయని ముందే ఊహించి, తీర్పు ముహూర్తానికి కొన్ని గంటల ముందునుంచే దుకాణాలను, దివాణాలను దగ్గరుండి బంద్ చేయించి, చెప్పకుండానే కర్ఫ్యూ వాతావరణం తెచ్చేసి ఎంత హైరాణ పడ్డారు!? అదంతా అకారణ భయమని పోలీసుల పగవాళ్లు కూడా అనలేరు. షాబుద్దీన్‌లూ, తొగాడియాలూ లేటెస్టుగా బుద్ధిమాన్ బాలక్‌లు ఏమీ కాలేదు. రంకెలు వేసి దుంపలు తెంచడానికి వాళ్లూ వీళ్లూ ఎవర్‌రెడీనే. ఎటొచ్చీ వాళ్లను పట్టించుకొనే తీరికే, కోరికే ఇవాళ్టి భారతదేశానికి లేదు. రామజన్మభూమి - బాబరీ మసీదు గొడవనేది ఈ కాలపు వాళ్ల దృష్టిలో చచ్చిన సమస్య. అందుకే ఇరుపక్షాల్లో మత పెద్దలు తాజా తీర్పుపై ఎంత అసంతృప్తి వెలిబుచ్చినా ఏ మతవర్గంలోనూ అలజడి లేవలేదు. దేశం మొత్తంలో ఆకయినా కదలలేదు. కాబట్టి అరవై ఏళ్లకిందటి వ్యాజ్యంలో ఇప్పుడా తీర్పు అని ఆక్షేపించాల్సిన పనిలేదు. నత్తలకు ముత్తాత అయిన భారత న్యాయవ్యవస్థలో జడ్జిమెంట్లు జీవితకాలం లేటు అవటమూ ఇలాంటప్పుడు మేలే కాబోలు!
* * *
సాధారణంగా ఏ వ్యాజ్యంలోనైనా తీర్పరి చెప్పేదాన్ని కొందరు మెచ్చుకుంటారు. కొందరు నొచ్చుకుంటారు. కేసు గెలిచినవాడు ఎగిరి గంతేస్తాడు. ఓడినవాడు పై కోర్టుకు పోతాడు. అయోధ్య కేసు చిత్రం! దానిలో కక్షిదారులు ముగ్గురు. తీర్పును చూశాక ముగ్గురూ పై కోర్టుకు అపీలుకు పోవాలనే అనుకుంటున్నారు! గెలిచానన్న సంతోషం ఏ ఒక్క కక్షిదారుడికీ కలిగించనిది ఇదేమి తీర్పు అని వాళ్లు, మిగతావాళ్లు తీర్పరులను తప్పుబడుతున్నారా అంటే అదీ లేదు. లోన ఎంత గొణిగినా, పైకి ఎంత సణిగినా తీర్పు మీద బాహాటంగా ధ్వజమెత్తి, బజార్నపడే దమ్ములు ఎవరికీ లేవు. మామూలుగా... ముస్లింలు, హిందువులు తగవుపడ్డ పెనువివాదంలో తీర్పును ‘సెక్యులర్’ వామాచారులు పొగిడితే ‘కాషాయం’ కాంపువాళ్లు తెగడుతారు. వారు తెగడితే వీరు పొగుడుతారు. అయోధ్య తీర్పుకు మాత్రం వారూ వీరూ జాయింటుగా జేజేలు పలకటం విశేషం!
ముగ్గురు తగవుపడ్డ భూమిని ముగ్గురికీ సమానంగా పంచి అన్ని పక్షాలకూ, ఉభయమతాలకూ సమాన న్యాయంచేసిన అలహాబాదు న్యాయాన్ని కొనియాడని మీడియా లేదు. మత కల్లోలాలకు తావులేకుండా మంచిపని చేశారని తల ఊచని రాజకీయ జీవీ లేడు. మేధావీ లేడు. ఈ మెచ్చుకోళ్లు, వీరతాళ్లు చాలా బోలెడు సమంజసమే. ఎటొచ్చీ... సూడో సెక్యులర్ శషభిషలతో పనిలేని సగటు మానవుడికి వచ్చే డౌటల్లా ఒక్కటే.
న్యాయస్థానమనేది పంచాయతీ రచ్చబండ కాదుకదా? తన ముందుకు వచ్చిన వ్యాజ్యంలో ఏ కక్షిదారు కోరేది సబబో, ఎవరి వాదం ఎంతవరకు చట్టబద్ధమో నిర్ధారించి... ఎవరి ప్రార్థనను మన్నించాలన్నదే కదా కోర్టు చేయాల్సిన పని? మరి - ఊళ్లో వాళ్లు తగవు పడితే ఊరి పెద్దలు కలగజేసుకుని, వారివారి వాదాలతో నిమిత్తం లేకుండా, తమకు తోచిన విధంగా పంచాయతీ పరిష్కారం చేసినట్టు... ఎవరూ కోరని దానిని తనకు తాను నిర్ణయించి, అందరి మీదా రుద్దే అధికారం ఎంత ఉన్నత న్యాయస్థానానికైనా ఉన్నదా?
అలహాబాద్ హైకోర్టుకు వెళ్లింది వివాదాస్పద స్థలం ఎవరిదన్న యాజమాన్య సమస్య. అది మాదంటే మాదని వాదులాడిన వారిలో ఎవరిది న్యాయమన్నదే న్యాయపీఠం ప్రధానంగా తేల్చాలి. హక్కు ఎవరిదని తేలితే వారికే ఆస్తి దక్కాలి. వివాదాస్పద స్థలం ఎవరిదో తేల్చమని కక్షిదారులు కోరారే తప్ప... ఆ స్థలాన్ని మాలో మేము ఎలా పంచుకోవాలని అడగలేదు. తాను పరిశీలించాల్సింది హక్కుల వ్యాజ్యమే తప్ప పంపకాల దావా కానప్పుడు ముగ్గురూ సమానంగా పంచుకోవాలని లక్నో బెంచి పంచాయతీ పరిష్కారం ఎలా చేసింది?
ధర్మాసనం మీద న్యాయమూర్తులు ముగ్గురు. ఒకే వ్యాజ్యంలో ముగ్గురూ మూడు రకాల తీర్పులు ఇచ్చారు. మిగతా విషయాల్లో ఎవరు ఎలా విభేదించినా... అరవై ఏళ్ల కింద రామ్‌లాలా విగ్రహాలు ప్రతిష్ఠించి, హిందువులు పూజిస్తున్న స్థలం రామజన్మభూమే; దాని మీద హక్కు హిందూ పక్షానికే చెందాలి- అన్న విషయంలో ముగ్గురూ ఏకీభవించారు. గుడిని కూల్చి బాబరీ మసీదును కట్టలేదని; కూలిన గుడి శిథిలాల మీద మసీదును కట్టారని కనుగొన్న న్యాయమూర్తి కూడా సరిగ్గా ఆ మసీదు కింది పూజాస్థలంపై హిందువులదే హక్కని తేటతెల్లంచేశారు. అసలు గొడవంతా అది రాముడి జన్మస్థానమా, బాబరు మసీదా అన్న విషయం మీదే అయినప్పుడు... ఆది నుంచీ ఉన్న గుడి స్థానంలో మసీదు కట్టారన్న వాదాన్ని ముగ్గురు తీర్పరులూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నప్పుడు వివాదాస్పద స్థలం మొత్తాన్ని జస్టిస్ శర్మ చెప్పినట్టు హిందూ కక్షిదారుకే కదా దఖలు పరచాలి? మరి- లోపల హక్కయితే వీరిది; వెలుపల ఇతర మతస్థులు కూడా ఎప్పటినుంచో ప్రార్థనలు చేస్తున్నట్టు తేలింది కనుక వారికీ జాయింటు హక్కు ఉంది; కాబట్టి కక్షిదారులు ఆస్తిని ఇదిగో ఈ విధంగా పంచుకోవాలి- అంటూ న్యాయస్థానం వాటాలు వేయటం చట్టరీత్యా చెల్లుతుందా? అందరికీ న్యాయం చేయబోయన అలహాబాదు ఉద్దేశం, మంచిదే అయనా న్యాయం సుప్రీంకోర్టు పరీక్షలో నిలబడుతుందా?
-సాక్షి

No comments:

Post a Comment